రహదారులను అప్ గ్రేడ్ చేయండి
కేంద్ర మంత్రి గడ్కరీతో సీఎం భేటీ
న్యూఢిల్లీ – తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి న్యూఢిల్లీలో బిజీగా ఉన్నారు. మంగళవారం కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా కేంద్ర ఉపరితల, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో రేవంత్ రెడ్డి సమావేశం కావడం ప్రాదాన్యత సంతరించుకుంది.
ఇదిలా ఉండగా రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కూడా సీఎం వెంట ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారులు అభివృద్ది , రాష్ట్రీయ రహదారులను జాతీయ రహదారులుగా మార్చాలని కోరారు.
తెలంగాణ లోని 15 రాష్ట్రీయ రహదారులను జాతీయ రహదారులుగా అప్ గ్రేడ్ చేయాలని కేంద్ర మంత్రికి విన్నవించారు. హైదరాబాద్ శ్రీశైలం ఫోర్ లైన్ ఎలివేటెడ్ కారిడార్, హైదరాబాదు కల్వకుర్తి రహదారి నీ నాలుగు వరుసల గా అభివృద్ధి చేయడం, రీజినల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం అభివృద్ధి, హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని ఆరు వరుసలుగా విస్తరించడం పై గడ్కరీ తో రేవంత్ రెడ్డి , మల్లు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేకంగా చర్చించారు.
సీఆర్ఐఎఫ్ నుండి తెలంగాణ కు నిధుల కేటాయింపు పెంచాలనీ కోరారు. అంతే కాకుండా నల్గొండలో ట్రాన్స్పోర్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయాలని, నల్గొండ పట్టణానికి బైపాస్ రోడ్డు మంజూరు చేయాలని కోమటిరెడ్డి కోరారు.