మేడారం జాతరకు 6 వేల బస్సులు
వెల్లడించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్
హైదరాబాద్ – ప్రపంచంలోనే అతి పెద్ద జాతర మేడారం కోసం ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు గాను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) విస్తృతంగా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్.
బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మేడారం జాతరకు సంబంధించి రాష్ట్రంలోని నలు మూలల నుంచి బస్సులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఏకంగా 6,000 వేలకు పైగా బస్సులను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు వీసీ సజ్జనార్.
ఇందుకు సంబంధించి మేడారంలోని 55 ఎకరాలలో సువిశాలమైన బేస్ క్యాంప్ ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అంతే కాకుండా భక్తుల కోసం 7 కిలోమీటర్ల మేర 50 క్యూ లైన్లను ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 51 ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంపులు కూడా ఉన్నాయని చెప్పారు వీసీ సజ్జనార్.
మరో వైపు 30 ఎకరాల విస్తీర్ణంలో 5 చోట్ల బస్సులకు సంబంధించిన పార్కింగ్ లను ఏర్పాటు చేశామన్నారు. తాడ్వాయిలో ఎమర్జెన్సీ టికెట్ ఇష్యూయింగ్ కేంద్రాన్ని కూడా అందుబాటులో ఉంచామన్నారు.
బస్సుల మెయింటెనెన్స్ కోసం 3 చోట్ల గ్యారేజీలు ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు ఎండీ.