రాలిన రైతన్న రాహుల్ ఆవేదన
కాల్పుల్లో యువ రైతు మృతి
న్యూఢిల్లీ – తాము పండించే పంటకు కనీస మద్దతు ఇవ్వాలని కోరుతూ రైతులు చేపట్టిన పోరాటం ఉద్రిక్తంగా మారింది. ఖనౌరీ సరిహద్దులో జరిగిన కాల్పుల్లో యువ రైతు శుభకరన్ సింగ్ ప్రాణాలు కోల్పోయినట్లు సమచారం. దీనిపై తీవ్రంగా స్పందించారు ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ. యువ రైతు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆవేదన చెందారు. మోదీ చేతకాని తనానికి ఇది ప్రత్యక్ష నిదర్శనమని పేర్కొన్నారు .
ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియ చేస్తున్నానని అన్నారు రాహుల్ గాంధీ. గతంలో చేపట్టిన రైతుల ఉద్యమంలో 700 మందికి పైగా రైతులు ప్రాణాలు కోల్పోయారని, కానీ మోదీ సర్కార్ స్పందించిన పాపాన పోలేదన్నారు.
ఇవాళ మరోసారి రైతులు రోడ్డెక్కారని, దేశ రాజధానిని అష్ట దిగ్భంధనం చేసేందుకు ప్రయత్నం చేసినా ప్రధానమంత్రిలో చలనం లేక పోవడం విడ్డూరంగా ఉందన్నారు వాయనాడు ఎంపీ. మోదీ ఒంటెద్దు పోకడ, నియంతృత్వపు ఆలోచనల కారణంగానే ఇవాళ కోట్లాది మంది రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. ఏది ఏమైనా కాల్పులు జరపడం దారుణమన్నారు. ఈ దేశంలో డెమోక్రసీ అనేది ఉందా అన్న అనుమానం తనకు కలుగుతోందన్నారు రాహుల్ గాంధీ.