మరో రెండు గ్యారెంటీలకు ఓకే
ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖుష్ కబర్ చెప్పారు. ఎన్నికల హామీల్లో భాగంగా ఇప్పటికే రెండు హామీలను అమలు చేశామని స్పష్టం చేశారు. వీటితో పాటు కొత్తగా మరో రెండు గ్యారెంటీలైన గృహ జ్యోతి, గ్యాస్ సిలిండర్ అమలు చేసేందుకు శ్రీకారం చుట్టామన్నారు.
ఈనెల 27న లేదా 29న అధికారికంగా ప్రారంభిస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి. ఇందుకు సంబంధించిన విధి విధానాలపై కేబినెట్ సబ్ కమిటీతో సీఎం సమీక్ష చేపట్టారు. గృహలక్ష్మి, రూ.500లకు గ్యాస్ సిలిండర్ పథకాల అమలుకు వెంటనే సన్నాహాలు చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు.
ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులందరికీ లబ్ధి జరిగేలా చూడాలని సీఎం సూచించారు.
సచివాలయంలో రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం అందించే మహాలక్ష్మి, ఆరోగ్య శ్రీ పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచే పథకాలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి.