అమరావతి గ్రాఫిక్స్ పేరుతో మోసం
ఏపీ పీసీసీ చీఫ్ మొరుసుపల్లి షర్మిల
అమరావతి – టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు ఏపీ పీసీసీ చీఫ్ మొరుసుపల్లి షర్మిలా రెడ్డి. అమరావతి రాజధాని అంటూ ఊదర గొట్టారని,, ఇప్పుడు మరోసారి రాజకీయం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు. వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడారు. అమరావతిని భూతద్దంలో చూపించాడని, ఆ తర్వాత చేతులెత్తేశాడని మండిపడ్డారు.
లక్ష కోట్ల అప్పులు పేరుకు పోయాయని , చంద్రబాబు నాయుడు, జగన్ రెడ్డి ఇద్దరూ ఇద్దరేనంటూ ఎద్దేవా చేశారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని, కేవలం ప్రచారం తప్ప పని చేసిన దాఖలాలు ఎక్కడా లేవన్నారు వైఎస్ షర్మిల.
ఈ రాష్ట్రంలో వైసీపీ , టీడీపీ, జనసేన పార్టీలకు ఓటు వేస్తే అన్ని ఓట్లు గంప గుత్తగా బీజేపీకి వేసినట్టే అవుతుందని హెచ్చరించారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని సూచించారు. తమ విలువైన ఓటు హక్కును పని చేసే వారికే వేయాలని కోరారు వైఎస్ షర్మిల.
ప్రస్తుతం ఆయా పార్టీలను ఏ ఒక్కరూ నమ్మడం లేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి రోజు రోజుకు పెరుగుతున్న ఆదరణను చూసి తట్టుకోలేక పోతున్నారంటూ మండిపడ్డారు.