జనసేన ప్రచార రథాలు షురూ
ప్రారంభించిన నాగ బాబు కొణిదెల
అమరావతి – ఏపీలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ. ఈ మేరకు ప్రచార రథాలను సిద్దం చేసింది. ఇందులో భాగంగా భారీ ఎత్తున ప్రచార వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు జనసేన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నాగబాబు కొణిదెల.
ఈ సందర్బంగా పార్టీ నేతలను ఉద్దేశించి ప్రసంగించారు. ఎలాగైనా సరే ఈసారి జనసేన సత్తా ఏమిటో చూపించాలని పిలుపునిచ్చారు. పార్టీ నేతలు, కార్యకర్తలకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. 175 సీట్లకు గాను టీడీపీ, జనసేన పార్టీల కూటమికి కనీసం 110 సీట్లకు పైగానే వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, ప్రజలు వైసీపీని ఓడించేందుకు, జగన్ మోహన్ రెడ్డిని సాగనంపేందుకు సిద్దమై ఉన్నారని జోష్యం చెప్పారు. అన్ని వ్యవస్థలను నాశనం చేసి, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనుడు జగన్ రెడ్డి అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
ఈ సారి ఎన్నికలు నీతికి, అవినీతికి మధ్య జరుగుతున్న పోరాటంగా నాగబాబు అభివర్ణించారు. ఈ రెండు నెలలు మనకు అత్యంత కీలకమని, ఏ ఒక్క ఓటు చీలకుండా చూడాలని పిలుపునిచ్చారు.