DEVOTIONAL

బ్ర‌హ్మోత్స‌వాల బుక్ లెట్ రిలీజ్

Share it with your family & friends

ఆవిష్క‌రించిన టీటీడీ చైర్మ‌న్

తిరుప‌తి – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కింది తిరుప‌తి లోని ప్ర‌సిద్ధ దేవాల‌యం శ్రీ క‌పిలేశ్వ‌ర స్వామి ఆల‌యం. ప్ర‌తి ఏటా మార్చి నెల‌లో బ్ర‌హ్మోత్సవాలు జ‌ర‌గ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. ఇదిలా ఉండ‌గా శ్రీ క‌పిలేశ్వ‌ర స్వామి గుడిలో వ‌చ్చే మార్చి నెల 1 నుండి 10వ తేదీ వ‌ర‌కు ప‌ది రోజుల పాటు బ్ర‌హ్మోత్స‌వాలు జ‌ర‌గ‌నున్నాయి. ఇందుకు సంబంధించిన బుక్ లెట్ ను తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి ఆవిష్క‌రించారు.

తిరుపతిలోని పద్మావతి పురంలోని ఛైర్మ‌న్ నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది. ఫిబ్ర‌వ‌రి 29వ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభ‌మ‌వుతాయి. ప్రతిరోజూ ఉదయం 7 నుండి 9 గంటల వరకు, తిరిగి రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.

ఇదిలా ఉండ‌గా మార్చి 1న ఉద‌యం ధ్వ‌జారోహ‌ణం, రాత్రి హంస వాహ‌నం , 2న ఉద‌యం సూర్య ప్ర‌భ వాహ‌నం, రాత్రి చంద్ర‌ప్ర‌భ వాహ‌నం, 3న ఉద‌యం భూత వాహ‌నం, రాత్రి సింహ వాహ‌నం జ‌రుగుతుంద‌ని టీటీడీ చైర్మ‌న్ వెల్ల‌డించారు.

మార్చి 4న ఉద‌యం మ‌క‌ర వాహ‌నం , రాత్రి శేష వాహ‌నంలో స్వామి వారు ఊరేగుతారు. 5న ఉద‌యం తిరుచ్చి ఉత్స‌వం, రాత్రి అధికార నంది వాహ‌నం, 6న ఉద‌యం వ్యాఘ్ర వాహ‌నం, రాత్రి గ‌జ వాహ‌నం, 7న ఉద‌యం క‌ల్ప‌వృక్ష వాహ‌నం, రాత్రి అశ్వ వాహ‌నంలో ఊరేగ‌నున్నారు.

మార్చి 8న ఉద‌యం ర‌థోత్స‌వం, రాత్రి నంది వాహ‌నం, 9న ఉద‌యం పురుషామృగ వాహ‌నం, క‌ళ్యాణోత్స‌వం, రాత్రి తిరుచ్చి ఉత్స‌వం, 10న ఉద‌యం త్రిశూల స్నానం ధ్వ‌జారోహ‌నం, రాత్రి రావ‌ణాసుర వాహ‌నం ఉంటుంద‌ని టీటీడీ చైర్మ‌న్ తెలిపారు.