DEVOTIONAL

ర‌మ‌ణ దీక్షితులుపై కేసు న‌మోదు

Share it with your family & friends

ఫిర్యాదు చేసిన తిరుమ‌ల తిరుప‌తి దేవస్థానం

తిరుమ‌ల – తిరుమ‌లలో కొలువైన శ్రీ‌వారి ఆల‌య గౌర‌వ ప్ర‌ధాన అర్చ‌కుడు ర‌మణ దీక్షితుల‌కు బిగ్ షాక్ త‌గిలింది. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) ఫిర్యాదుతో ర‌మ‌ణ దీక్షితులుపై తిరుమ‌ల వ‌న్ టౌన్ పోలీసులు కేసు న‌మోదు చేసిన‌ట్టు స‌మాచారం.

టీటీడీ పరిపాలన అంశాలు, అధికారులు, పోటు సిబ్బంది, జీయంగార్లపై రమణ దీక్షితులు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసినట్టు సోషల్‌ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో టీటీడీ ప్రతిష్ఠ దిగజార్చేలా రమణ దీక్షితులు వ్యాఖ్యలు చేశారంటూ టీటీడీకి చెందిన సైబర్‌ సెక్యూరిటీ అండ్‌ సోషల్‌ మీడియా మానిటరింగ్‌ సెల్‌ అధికారి మురళీ సందీప్‌ శుక్రవారం రాత్రి 10 గంటలకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.

దీనిపై పోలీసులు సెక్షన్‌ 153ఏ, 295, 295ఏ, 505(2), రెడ్‌విత్‌ 120 మేరకు కేసు నమోదు చేసినట్టు సమాచారం.

మరోవైపు నిధుల కోసం ప్రయత్నిస్తున్నామంటూ రమణ దీక్షితులు తమపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ అహోబిలం మఠం నుంచి కూడా టీటీడీకి శనివారం ఓ లేఖ అందింది.

ఇదిలా ఉండగా చాలాకాలం తరువాత శనివారం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో శ్రీవారి ఆలయంలో రమణదీక్షితులు ప్రత్యక్షం కావడం విశేషం.

శ్రీవారిని దర్శించుకుని సుమారు గంట పాటు ఆలయంలోనే గడిపిన ఆయన చిరునవ్వుతో అందరినీ పలకరిస్తూ కనిపించారు.