ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ గా జిల్లెల
మాజీ మంత్రికి కేబినెట్ హోదా ర్యాంక్
హైదరాబాద్ – రాష్ట్ర ప్రభుత్వం రెండు కీలక పోస్టులను భర్తీ చేసింది. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా ప్రజాపక్షం ఎడిటర్ కె. శ్రీనివాస్ రెడ్డిని నియమించింది. ఇదే సమయంలో మాజీ మంత్రి ప్రముఖ సీనియర్ నాయకుడు జిల్లెల చిన్నారెడ్డిని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ గా ఖరారు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఇది పూర్తిగా మంత్రి పదవితో సమానమైన పోస్టు.
తాజాగా జరిగిన ఎన్నికల్లో చిన్నారెడ్డి వనపర్తి నుంచి టికెట్ ను ఆశించారు. ఆయన పేరును కూడా ఖరారు చేసింది ఏఐసీసీ. కానీ ఊహించని రీతిలో ఆయనపై తిరుగుబాటు చేశారు ప్రస్తుతం ఎమ్మెల్యేగా గెలుపొందిన తూడి మేఘా రెడ్డి. దీంతో చిన్నా రెడ్డికి ఇచ్చిన టికెట్ ను మేఘా రెడ్డికి కేటాయించింది.
ఈ సమయంలో ఆయనకు సముచిత స్థానం ఇస్తారని అంతా భావించారు. కానీ ఇవ్వలేదు. తాజాగా ఎమ్మెల్సీ ఇస్తారని భావించారు. రాజ్యసభ సీటును ఇస్తారని అనుకున్నారు జిల్లెల చిన్నారెడ్డి. ఆయనతో పాటు మహమ్మద్ అజహరుద్దీన్ కూడా ఆశించారు. కానీ ఎంపీ సీట్లు ఖరారు చేయలేదు. చివరకు వైస్ చైర్మన్ పదవి దక్కడం విశేషం. ఇప్పటి వరకు వనపర్తి నుంచి చిన్నారెడ్డి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాజశేఖర్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా పని చేశారు.