కుప్పం చిరకాల వాంఛను నెరవేర్చా
సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటన
చిత్తూరు జిల్లా – తాను మాటివ్వనని ఇస్తే తప్పనని స్పష్టం చేశారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి . తాగు, సాగునీటి కోసం దశాబ్ధాలుగా ఎదురు చూస్తున్న కుప్పం ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చడం జరిగిందన్నారు. కరువుకు లోనైన కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలను తరలిస్తానన్న మాట నిలబెట్టుకున్నానని చెప్పారు.
నియోజకవర్గంలోని 110 మైనర్ ఇరిగేషన్ చెరువుల ద్వారా 6,300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లోని 4.02 లక్షల జనాభాకు త్రాగు నీరు అందించామన్నారు. అనంత వెంకటరెడ్డి హంద్రీ-నీవా సుజల స్రవంతిలో భాగంగా రూ. 560.29 కోట్ల వ్యయంతో చేపట్టిన కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు.
చిత్తూరు జిల్లా రామకుప్పం రాజుపేట వద్ద కృష్ణా జలాలు విడుదల చేశారు ఏపీ సీఎం జగన్ రెడ్డి. అనంతరం గుండుశెట్టిపల్లెలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు జగన్ రెడ్డి. గతంలో ప్రాజెక్టుల పేరుతో ప్రజలను, రాష్ట్రాన్ని మోసం చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడిది కాదా అని ప్రశ్నించారు.