DEVOTIONAL

బ్ర‌హ్మోత్స‌వ ఏర్పాట్ల‌పై జేఈవో ఆరా

Share it with your family & friends

భ‌క్తుల‌కు ఇబ్బందులు లేకుండా చూడాలి

తిరుప‌తి – శ్రీనివాస మంగాపురం లోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల‌ను టీటీడీ జేఈవో వీర బ్ర‌హ్మం త‌నిఖీ చేశారు. ఈ సంద‌ర్భంగా జేఈవో మాట్లాడారు. ఈ నెల 29వ తేదీన ధ్వజారోహణంతో ప్రారంభమై మార్చి 8వ‌ తేదీన ధ్వజావరోహణంతో ముగియనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు ఎలాంటి రాజీకి తావు లేకుండా ఏర్పాట్లు చేప‌ట్టాల‌న్నారు.

ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పుష్పాలంకరణలు, ఇంజినీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో ముందస్తుగా క్యూలైన్లు, చలువ పందిళ్లు, అన్ని కూడళ్లలో ఫ్లెక్సీ బోర్డులు, విద్యుత్‌ విభాగం ఆధ్వర్యంలో వివిధ దేవతా మూర్తుల కటౌట్లు, దేదీప్యమానంగా విద్యుద్దీపాలంకరణలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

బ్రహ్మోత్సవాలలో అవసరమైనంత మంది శ్రీవారి సేవకులను అందుబాటులో ఉంచాలని ముఖ్య ప్రజా సంబంధాల అధికారికి సూచించారు. వాహన సేవలను ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయాలన్నారు.

ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలు, వాహన సేవల ముందు భజనలు, కోలాటాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రచార రథాల ద్వారా చుట్టు పక్కల గ్రామాల్లో ప్రచారం చేయాలని స్ప‌ష్టం చేశారు.

మొబైల్‌ మరుగుదొడ్లు, అదనపు పారిశుద్ద్య కార్మికులను నియమించాలని ఆరోగ్య విభాగం అధికారులను ఆదేశించారు. పార్కింగ్‌ స్థలాలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. విజిలెన్స్‌ అధికారులు చంద్ర‌గిరి పోలీసులతో సమన్వయం చేసుకుని పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ‌ చేపట్టాలని అన్నారు జేఈవో.

బ్ర‌హ్మోత్స‌వాల‌ను విజ‌య‌వంతం చేసేందుకు ఇత‌ర విభాగాల అధికారుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని ఆల‌య ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో వ‌ర‌ల‌క్ష్మీ, ఆల‌య ప్ర‌త్యేకాధికారి, సీపీఆర్వో డా.ర‌వికి సూచించారు.