NEWSTELANGANA

మల్కాజిగిరి సీటుపై పోటీ తీవ్రం

Share it with your family & friends

మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్న బీజేపీ

హైద‌రాబాద్ – సంస్థాగ‌తంగా అత్యంత బ‌లంగా ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీ అధిష్టానం త‌మ పార్టీకి సంబంధించి సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయ‌డంలో నానా తంటాలు ప‌డుతోంది. ప్ర‌ధానంగా ఒకే సీటుకు పెద్ద ఎత్తున నేత‌ల నుంచి పోటీ ఎదుర‌వుతోంది. రాష్ట్రంలో మొత్తం 17 ఎంపీ సీట్లు ఉన్నాయి.

ఇప్ప‌టి వ‌ర‌కు ఆరు సీట్ల‌ను ఖ‌రారు చేసింది. ఇందులో కేంద్ర మంత్రి, బీజేపీ చీఫ్ గంగాపురం కిష‌న్ రెడ్డి, బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్, ధ‌ర్మ‌పురి అర‌వింద్ కు సీట్ల‌ను కేటాయించింది. వీరితో పాటు డాక్ట‌ర్ వెంక‌టేశ్వ‌ర్లు, భువ‌న‌గిరి నుంచి బూర న‌ర్స‌య్య గౌడ్ కు ఛాన్స్ ఇచ్చింది.

అయితే హై క‌మాండ్ ఎన్నిక‌ల షెడ్యూల్ కంటే ముందే లోక్ స‌భ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించేందుకు క‌స‌ర‌త్తు ప్రారంభించింది. ఈ నేప‌థ్యంలోనే మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం పై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇక్కడ టికెట్ రేసులో మురళీధర్ రావు, ఈటెల రాజేందర్, మల్క కొమురయ్య ముందు వరుసలో ఉన్నారు.

ఎవరికి వారే టికెట్ ను దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆర్ఎస్ఎస్ అండ దండలు పుష్కలంగా ఉన్న మల్క కొమురయ్యను అధిష్టానం ఇవాళ‌ ఢిల్లీకి పిలవడం చర్చనీయాంశంగా మారింది.

ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, ఆర్ఎస్ఎస్ ప్రముఖులను కలిసే అవకాశం ఉందని తెలంగాణ బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మురళీధర్ రావు, ఈటెలకి కాకుండా మధ్యే మార్గంగా కొమురయ్య కు టికెట్ దక్కొచ్చనే చర్చ ప్రారంభం అయ్యింది.