కృష్ణ రాఘవను గెలిపిస్తే మంత్రిని చేస్తా
సంచలన ప్రకటన చేసిన ఏపీ సీఎం జగన్
చిత్తూరు జిల్లా – ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. సోమవారం కృష్ణమ్మ నీటిని కుప్పంకు తీసుకు వెళ్లారు. సాగు, తాగు నీటిని అందించే పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్బంగా మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో కాలు మోపారు. అబద్దాలు, మోసాలకు కేరాఫ్ అంటూ ఎద్దేవా చేశారు.
రాజకీయంగా ఎవరితోనైనా పోరాడేందుకు తాను సిద్దంగా ఉన్నానని ప్రకటించారు జగన్ మోహన్ రెడ్డి. కుప్పం నియోజకవర్గంలోని రెండు లక్షల మందికి పైగా నిర్వాసితులకు ఆసరా కల్పించే లక్ష్యంతో చేపట్టిన హంద్రీ నీవా సుజల స్రవంతి పథకాన్ని పూర్తి చేశామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం తాను సక్సెస్ అయ్యానని అన్నారు.
తాను మాటల సీఎంను కానని చేతల సీఎం అంటూ చెప్పారు జగన్ రెడ్డి. ప్రారంభోత్సవం అనంతరం జరిగిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. కుప్పంలో 93.2 శాతం కుటుంబాలు ‘నవరత్నాలు’ కింద ప్రభుత్వ సంక్షేమ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నాయని చెప్పారు.
కుప్పం యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అభ్యర్థిగా శాసన మండలి సభ్యుడు కృష్ణ రాఘవ జయేంద్ర భరత్‌ని ప్రకటించామని, ఆయనను గెలిపిస్తే మంత్రిని చేస్తానని హామీ ఇచ్చారు జగన్ మోహన్ రెడ్డి.