నాకు ఏ పార్టీతో సంబంధం లేదు
నటుడు మంచు మోహన్ బాబు
హైదరాబాద్ – ప్రముఖ విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని స్పష్టం చేశారు. తన పేరుతో రాజకీయం చేయాలని చూసినా లేదా వాడుకోవాలని అనుకున్నా తాను ఊరుకోనంటూ హెచ్చరించారు.
అలా ఎవరైనా చేస్తే వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటానని చెప్పారు. సోమవారం మంచు మోహన్ బాబు ట్విట్టర్ వేదికగా ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. విచిత్రం ఏమిటంటే త్వరలోనే ఏపీలో శాసన సభ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి.
గతంలో టీడీపీలో ఉన్నారు. ఆ తర్వాత వైఎస్సార్సీపీ చీఫ్ , ఏపీ సీఎం జగన్ రెడ్డితో టచ్ లో ఉన్నారు. మొత్తంగా మంచు మోహన్ బాబు తాజాగా చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ఇటీవల హైదరాబాద్ సినీ రంగానికి సంబంధించి జరిగిన ఎన్నికల్లో నానా హంగామా చేశారు.
మంచు విష్ణు ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాడు. ఈ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలను తలపింప చేశాయి. అంతకు ముందు తన కుటుంబంతో కలిసి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేశారు.