జగన్ దేవుడితో ఆటలొద్దు
నిప్పులు చెరిగిన నారా లోకేష్
అమరావతి – టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిప్పులు చెరిగారు. తాజాగా తిరుమల ఆలయంలో ప్రధాన అర్చకుడిగా ఉన్న రమణ దీక్షితులును తొలగిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి తీర్మానం చేసింది. ఈ మేరకు ఈ విషయాన్ని టీటీడీ చైర్మన్ సైతం వెల్లడించారు. ఆయనపై తిరుమల వన్ టౌన్ లో కేసు నమోదైంది. టీటీడీ ఆలయ ప్రతిష్టకు భంగం వాటిల్లేలా ప్రవర్తించడం, కామెంట్స్ చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది.
రమణ దీక్షితులుపై చర్యలు తీసుకోవడాన్ని అభ్యంతరం వ్యక్తం చేశారు నారా లోకేష్. సోమవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఏపీ సీఎం జగన్ రెడ్డిని ఏకి పారేశారు. నియంత పాలనలో నోరువిప్పడం నేరమేనని పేర్కొన్నారు.
తిరుమల ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా వైసిపి నాయకులు చేస్తున్న అకృత్యాలను బయట పెట్టిన ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై వేటు వేయడం దారుణమన్నారు. కొండ పై వైసిపి నేతలు, కొంత మంది అధికారులు కలిసి చేస్తున్న దారుణాల గురించి ఆ కలియుగ దైవమే రమణ దీక్షితులు గారి నోటి నుండి భక్తులకు తెలిసేలా చేశారని అన్నారు.
చేసిన తప్పులు, పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సింది పోయి రమణ దీక్షితులుపై కేసు పెట్టడం, అరెస్ట్ చెయ్యాలని చూడటం జగన్ అహంకారానికి నిదర్శనమన్నారు. దేవుడి జోలికి వెళ్లిన వారు ఎవ్వరూ బాగుపడినట్టు చరిత్ర లో లేదన్నారు. దైవంతో ఆటలోద్దు జగన్ అంటూ హెచ్చరించారు.