జగన్ సర్కార్ పై షర్మిల గుస్సా
ఇవేం క్రీడలంటూ మండిపాటు
అమరావతి – ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. ఆడుదాం ఆంధ్ర అంటూ ఎవరి కోసం క్రీడల పోటీలు నిర్వహించారంటూ నిలదీశారు. మంగళవారం ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది.
ఇంతకంటే సిగ్గుచేటు విషయం ఇంకేమన్నా ఉంటుందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అన్నింటిలో నీచ రాజకీయాలకు తెర లేపారంటూ ఆరోపించారు వైఎస్ షర్మిల.
ఇప్పుడు క్రీడలపై కూడా వారి దౌర్భాగ్య రాజకీయాలను, అధికార మదాన్ని చూపుతున్నారంటూ ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రతిష్ఠను అన్నివిధాలుగా నాశనం చేసిన వీళ్ళు ఇంకా ఎంత లోతులకు దిగజార్చుతారో మనం ఊహించలేమంటూ ఆవేదన చెందారు.
ఆడుదాం ఆంధ్ర అంటూ రెండు నెలలు సినిమా స్తంట్స్ చేయించారంటూ వైసీపీ నేతలను. అసలు ఆడుతున్న ఆటలు ఇవేనా అని నిలదీశారు. ఆటగాళ్ల భవితను, ఆత్మ విశ్వాసాన్ని ఇలా నాశనం చేస్తారా అని వాపోయారు.
ఇది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లేక అధ్వానపు క్రికెట్ అసోసియేషనా అని మండిపడ్డారు వైఎస్ షర్మిలా రెడ్డి. ఈ విషయంపై వెను వెంటనే నిస్పాక్షికమైన విచారణ జరగాలి అని కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నది.