బీఆర్ఎస్..బీజేపీ ఒక్కటే
రాములమ్మ సెటైర్
హైదరాబాద్ – కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు , ప్రముఖ నటి విజయ శాంతి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ట్విట్టర్ వేదికగా భారత రాష్ట్ర సమితి పార్టీని, భారతీయ జనతా పార్టీని ఏకి పారేశారు. ఈ రెండు పార్టీలు ఒక్కటేనని పేర్కొన్నారు. ఈ ఇద్దరిలో ఎవరికి ఓటు వేసినా ఒక్కటేనని హెచ్చరించారు.
అందుకే ప్రజలు తమ పార్టీకి పట్టం కట్టారని అన్నారు. తాము ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. అధికారం పోయిందన్న అక్కసుతో మాజీ మంత్రి కేటీఆర్, హరీశ్ రావులు పదే పదే చవకబారు ప్రకటనలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఏ శక్తి అడ్డు కోలేదన్నారు విజయ శాంతి. ఇదే సమయంలో తనను గనుక సీఎంగా ప్రకటించి ఉంటే గెలిచి ఉండే వాళ్లమని కేటీఆర్ చెప్పడం ఆయన అమాయకత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు.
కేసీఆర్ ఉంటేనే 39 సీట్లు వచ్చాయని, ఇక కేటీఆర్ ను ముందుంచితే ఆ సీట్లు కూడా వచ్చి ఉండేవి కావన్నారు. ఇక బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డికి అంత సీన్ లేదన్నారు. ఆయన ఉన్నా ఒకటే లేకున్నా ఒకటేనంటూ ఎద్దేవా చేశారు.