NEWSTELANGANA

300 ఎకరాల్లో రెండో జీనోమ్ వ్యాలీ

Share it with your family & friends

ప్ర‌క‌టించిన సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ – త్వరలోనే హైదరాబాద్ లో జీనోమ్ వ్యాలీ రెండవ ఫేజ్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైటెక్స్ లో హెల్త్‌ కేర్, లైఫ్ సైన్సెస్ బయో ఏషియా 2024 సదస్సును ప్రారంభించారు. ఈ ఏడాది జీనోమ్ వ్యాలీ ఎక్సెలెన్స్ 2024 అవార్డుకు ఎంపికైన నోబెల్ బహుమతి గ్రహిత ప్రొఫెసర్ గ్రెగ్ ఎల్.సెమెంజాను సీఎం అభినందించారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. మూడు వందల ఎకరాల్లో రూ.2000 కోట్ల పెట్టుబడులతో జీనోమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తామ‌న్నారు. లక్ష కోట్ల పెట్టుబడులతో పది ఫార్మా విలేజీలను ఏర్పాటు ప్రక్రియ ఇప్పటికే మొదలైందన్నారు. దీంతో మౌలిక సదుపాయాలతో పాటు ఔత్సహిక పారిశ్రామికవేత్తలకు అపారమైన అవకాశాలు అందుబాటులోకి వస్తాయ‌ని తెలిపారు.

5 లక్షల మందికి కొత్త ఉద్యోగాలు లభిస్తాయ‌ని స్ప‌ష్టం చేశారు. వికారాబాద్, మెదక్, నల్గొండ జిల్లాల్లో గ్రీన్ ఫీల్డ్ ఫార్మా సెక్టార్లలో ఈ ఫార్మా విలేజ్ లను ఏర్పాటు చేస్తామ‌ని వెల్ల‌డించారు సీఎం. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఒక గంట ప్రయాణ దూరంలోని అత్యంత సమీపంలో వీటిని ఏర్పాటు చేస్తున్నందున ప్రపంచంలోని పారిశ్రామిక వేత్తలందరికీ ఎంతో సదుపాయంగా ఉంటుంద‌న్నారు.

వైరస్ భయాలను ధీటుగా ఎదుర్కోగలమనే నమ్మకాన్ని హైదరాబాద్ కలిగించిందని, ఇప్పుడు ప్రపంచంలో వినియోగించే ప్రతి మూడు వ్యాక్సిన్లలో ఒకటి ఇక్క‌డ‌ ఉత్పత్తి అవుతోందని గుర్తు చేశారు. ఆరోగ్య భద్రత విషయంలో ప్రపంచంలోని అందరి సమస్యలు ఒకేలా ఉన్నాయని కోవిడ్ నిరూపించిందన్నారు.

ఒక్క బయో సైన్సెస్ లోనే కాదు, ఐటీ-సాఫ్ట్ వేర్, రీసెర్చ్, స్టార్టప్ రంగాలకు రాజధానిగా ఉన్న హైదరాబాద్ ను మరింత సమున్నతంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.