తెలంగాణలో ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ బదిలీ
ఆదేశాలు జారీ చేసిన సీఎస్ శాంతి కుమారి
హైదరాబాద్ – తెలంగాణలో కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ సర్కార్ బదిలీల జాతర ప్రారంభించింది. ఇప్పటికే ఆయా శాఖలలో ఏళ్ల తరబడి తిష్ట వేసుకుని కూర్చున్న వారిపై ఫోకస్ పెట్టింది. ఆయా ప్రభుత్వ శాఖలపై సమీక్షలు చేపడుతూ వస్తున్నారు నూతన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి. తాను మాటల మనిషిని కాదని చేతల సీఎంనంటూ చెప్పకనే చెప్పారు. ఇప్పటికే సమర్థవంతులైన, నాయకత్వ పటిమ కలిగిన, పరిపాలనా అనుభవం ఉన్న సీనియర్లను ఏరికోరి ఎంపిక చేసుకున్నారు. సీఎంఓలో నియమించుకున్నారు.
ఇదే సమయంలో వృత్తి పరంగా కఠినంగా వ్యవహరించే పేరున్న సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లను హైదరాబాద్ లో నియమించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇది తన పరిపాలన మార్క్ ఏమిటో చెప్పకనే చెప్పింది. పలువురు ఐఏఎస్ లకు స్థాన చలనం కలిగింది. మరో వైపు పంచాయతీరాజ్ లో సీనియర్ ఆఫీసర్లకు స్థాన చలనం కలిగింది.
తాజాగా ఎనిమిది మంది ఐఎఫ్ఎస్ ఆఫీసర్లను బదిలీ చేసింది. పైఫుల్లాను పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్మెంట్ స్పెషల్ కమిషనర్గా నియమించింది సర్కార్. ఈ మేరకు సీఎస్ శాంతి కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
ప్రియాంక వర్గీస్ ను ఐటీ శాఖకు మార్చింది. ములుగు ఫారెస్ట్ కాలేజ్ డైరెక్టర్ ఎస్టే ఆశాను నియమించింది. కాళేశ్వరం సర్కిల్ సీసీఎఫ్ గా ప్రభాకర్ , మీ సేవా కమిషనర్ గా రవి కిరణ్ , డిప్యూటీ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ ఆఫీసర్ గా అపర్ణ, వరంగల్ డీఎఫ్ఓ గా అంజు అగర్వాల్ ను నియమించారు.