క్రికెట్ పై రాజకీయాలు చేయొద్దు
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సూచన
అమరావతి – క్రికెటర్ హనుమ విహారి విషయంలో తమ పట్ల తీవ్ర ఆరోపణలు చేయడాన్ని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) తీవ్రంగా ఖండించింది. క్రికెట్ పై రాజకీయాలు చేయడం పట్ల ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సందర్బంగా కీలక ప్రకటన చేసింది.
క్రికెట్ అనేది ఒక జెంటిల్మెన్ గేమ్ అని, క్రికెట్ అభివృద్ధి విస్తరణలో దేశంలోని అనేక అసోసియేషన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపింది. ప్రతిష్టాత్మక ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా క్రికెట్ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తోందని స్పష్టం చేసింది. ఆటగాళ్ల ప్రవర్తనా నియమావళి, నిర్వహణలో నిర్దేశిత నియమ నిబంధనలు అనుసరిస్తూ అసోసియేషన్ ముందుకు సాగుతోందని స్పష్టం చేసింది. ఇందులో పక్షపాతం, రాగద్వేషాలకు ఎక్కడా తావు లేదని పేర్కొంది.
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌ను ఉద్దేశిస్తూ హనుమ విహారి ఇంస్టాగ్రామ్ ద్వారా చేసిన ఆరోపణలు మా దృష్టికి వచ్చాయని తెలిపింది. ఇలాంటి ఆరోపణలు విచారకరమని పేర్కొంది. ఆటగాళ్లమధ్య చిన్నచిన్న పొరపొచ్చాలు వచ్చినా వారి మధ్య సమన్వయం కుదిర్చి మంచి ఫలితాలు సాధించడం అన్నది జట్టు మేనేజ్‌మెంట్ మీద ఉన్న ప్రధాన బాధ్యత అని స్పష్టం చేసింది.
హనుమ విహారి బాల్యం నుంచి అన్ని ఏజ్ గ్రూప్‌ల్లోనూ హైదరాబాద్ తరఫున ఆడారు. 2017లో ఏపీకి వచ్చి రంజీ ట్రోఫీ ఆడారు. ఇక్కడి నుంచే ఇండియా జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. తర్వాత 2020 సీజన్లో తిరిగి హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. మళ్లీ ఆంధ్ర జట్టుకు తిరిగి వచ్చారు.
ఆంధ్రాలో చేరినప్పటి నుండి విహారి తనకు వస్తున్న ఆఫర్లు నేపథ్యంలో ఇతర రాష్ట్రాలకు వెళ్లడానికి తరచుగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) అడిగేవారు. హనుమ విహారి విజ్ఞప్తులను పలుమార్లు ఏసీఏ మన్నించింది. కాని ఈసారి ఎన్‌వోసీ ఇవ్వక పోవడంతో, భారతజట్టుకు ఎంపిక కాక పోవడం పట్ల తాను ఫ్రస్టేషన్‌లో ఎమోషన్‌కు గురయ్యానంటూ క్షమాపణలు కోరుతూ, ఆంధ్రా తరపున కొనసాగించాలంటూ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌ను కోరాడు.
జట్టులోకి విహారి రావడం, పోవడం వల్ల స్థానికంగా ఉన్న ఆటగాళ్లు అవకాశాలు కోల్పోతున్నారని, ఆటగాళ్ల తల్లిదండ్రులు ఎన్నోమార్లు అసోసియేషన్ దృష్టికి తీసుకు వచ్చారు. కాని, విహారికి ఉన్న అనుభవం దృష్ట్యా జట్టు మేనేజ్‌మెంట్ అతన్ని ఇక్కడే కొనసాగించింది. అయినప్పటికీ విహారి సోషల్ మీడియా వేదికగా తప్పుడు ఆరోపణలు చేయడం దురదృష్టకరం.