కాంగ్రెస్ సర్కార్ బేకార్
సాంకేతిక లోపాలు సహజం
హైదరాబాద్ – సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. శుక్రవారం ఆయన కేటీఆర్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. తమ ఉనికి కాపాడు కోవడానికి తమపై బురద చల్లడం మంచి పద్దతి కాదన్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి తాము ప్రాజెక్టు కట్టామని, ఇందులో ఎలాంటి అవినీతి, అక్రమాలు చోటు చేసుకోలేదన్నారు.
మేడిగడ్డ బ్యారేజ్ 86 పిల్లర్లలో మూడు పిల్లర్లు కుంగి పోతే వాటిని చూపించి ఆరోపణలు చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. తమ రాజకీయ లబ్ది కోసం రైతులను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు.
దేశ వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులలో కూడా సాంకేతిక లోపాలు నిత్యం వస్తుంటాయని, ఇవి సహజమని పేర్కొన్నారు మాజీ స్పీకర్. ప్రభుత్వ పరంగా వాటిని సరిదిద్దాలే తప్పా భూతద్దం పెట్టి చూపే ప్రయత్నం చేయొద్దని సూచించారు .
ఈసారి ఎన్నికల్లో తాము గెలుపొందడం ఖాయమని జోష్యం చెప్పారు. మోస పూరితమైన హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీపై ప్రజలు సరైన రీతిలో బుద్ది చెప్పడం ఖాయమని పేర్కొన్నారు.