బీజేపీలో భారీ ఎత్తున చేరిక
బీఆర్ఎస్ కు బిగ్ షాక్
న్యూఢిల్లీ – త్వరలో దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరనున్నాయి. ఈ తరుణంలో కీలకమైన నాయకులు వివిధ పార్టీలను వీడుతున్నారు. ప్రధానంగా భారత రాష్ట్ర సమితి పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, ప్రస్తుత నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు పోతుగంటి రాములు ఉన్నట్టుండి ఝలక్ ఇచ్చారు. ఆయన గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆ మేరకు న్యూఢిల్లీలో ప్రత్యక్షం అయ్యారు. ఆ వెంటనే బీజేపీ ఆఫీసులో బీజేపీ కండువా కప్పుకున్నారు.
పోతుగంటి రాములు గతంలో టీడీపీలో ఉన్నారు. రాష్ట్ర మంత్రిగా పని చేశారు. ఆయన చంద్రబాబు నాయుడు కేబినెట్ లో స్పోర్ట్స్ మినిష్టర్ గా క్రీడలు చేపట్టారు. ఇదే సమయంలో తెలుగుదేశం నుంచి జంప్ అయ్యారు. కేసీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఎంపీగా టికెట్ పొంది గెలుపొందారు.
ఇదే సమయంలో తన తనయుడు భరత్ ప్రసాద్ కూడా జంప్ అయ్యారు. బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చారు. తను ప్రస్తుతం కల్వకుర్తి జెడ్పీటీసీగా ఉన్నారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో కీలకమైన నాయకుడిగా గుర్తింపు పొందిన బీఆర్ఎస్ నేత జక్కా రఘునందన్ రెడ్డి సైతం జంప్ కావడం విస్తు పోయేలా చేసింది.
ఆయన మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ వ్యాపారవేత్త మర్రి జనార్దన్ రెడ్డికి అనుంగు అనుచరుడిగా ఉన్నారు. ఆయన కూడా కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు డీకే అరుణ, పొంగులేటి సుధాకర్ రెడ్డి సమక్షంలో చేరారు. రాములు, భరత్ , జక్కాతో పాటు వనపర్తి జెడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి కూడా కండువా కప్పుకున్నారు.