మోదీ మోసం ఏపీకి అన్యాయం
నిప్పులు చెరిగిన షర్మిల
తిరుపతి – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. పీసీసీ ఆధ్వర్యంలో తిరుపతిలో ఏపీ ప్రత్యేక హోదా సాధన సభ నిర్వహించారు. ఈ సభకు భారీ ఎత్తున జనం హాజరయ్యారు. ముఖ్య అతిథిగా యువ నాయకుడు సచిన్ పైలట్ హాజరయ్యారు. అశేష జన వాహిని పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు వైఎస్ షర్మిలా రెడ్డి.
మోసానికి చిరునామా మోదీ అని ఆరోపించారు. మోదీ ఏపీకి అనేక హామీలు ఇచ్చారని వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో అద్భుతమైన రాజధాని నిర్మిస్తామని చెప్పారని ఇప్పటి వరకు దాని ఊసెత్తడం లేదన్నారు.
రాష్ట్రాన్ని హార్డ్ వేర్ హబ్ చేస్తామన్నారని, ప్రత్యేక హోదా ఇస్తామని, పోలవరం కట్టిస్తామని చెప్పారని ఒక్కటి కూడా అమలు చేసిన పాపాన పోలేదన్నారు వైఎస్ షర్మిలా రెడ్డి. రామభక్తుడ్ని అని చెప్పుకునే మోదీ మూడు నామాల వానికి పంగనామాలు పెట్టాడంటూ ఎద్దేవా చేశారు.
పుణ్యక్షేత్రంలో నిలబడి మాట తప్పాడు .దేవుడ్ని కూడా మోసం చేసిన మిమ్మల్ని ఏమనాలంటూ ప్రశ్నించారు. మోదీని కేడీ అనక ఇంకేమనాలి? రాష్ట్ర హక్కుల సాధనలో బాబు, జగన్ ఇద్దరు విఫలమయ్యారని ఆరోపించారు.
ఒక్క హక్కు మీద కూడా పోరాటం చేయలేదు. చంద్రబాబు అయితే ఊసరవెల్లి లా రంగులు మార్చాడని. జగనన్న అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పులిలా గర్జించి అధికారం రాగానే పిల్లిలా అయ్యాడంటూ ఎద్దేవా చేశారు.