పదవులన్నీ రెడ్లకే ఇస్తే ఎలా
నిప్పులు చెరిగిన విశారదన్ మహారాజ్
హైదరాబాద్ – ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహారాజ్ నిప్పులు చెరిగారు. నాడు కేసీఆర్ హయాంలో ఒకే కుటుంబానికి కొలువులు దక్కితే ఇవాళ కొత్తగా ఏర్పడిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో గంప గుత్తగా ఒకే కులానికి చెందిన వారికే పదవులు దక్కాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు ప్రాతినిధ్యం లేకుండా పోయిందని ఆరోపించారు.
రేవంత్ రెడ్డి పైకి బహుజనుల పట్ల ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నాడని , కానీ లోలోపట తన కుల జాడ్యాన్ని ప్రదర్శిస్తున్నాడని మండిపడ్డారు. నియమించే నాలుగు పదవుల్లో మూడు పదవులను తన సామాజిక వర్గానికి కేటాయిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు విశారదన్ మహారాజ్.
ఇది ప్రజా పాలనా లేక రెడ్డి రాజుల పాలనా అనే అనుమానం కలుగుతోందన్నారు. మొన్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా మహేందర్ రెడ్డి, ప్రణాళిక సంఘం చైర్మన్ గా చిన్నా రెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ గా శ్రీనివాస్ రెడ్డిని నియమించారంటూ పేర్కొన్నారు.
ఇది కుల గణన సిద్దాంతాన్ని నమ్మే వాళ్లు చేసే పనేనా అని ధర్మ సమాజ్ పార్టీ ఈ ప్రభుత్వాన్ని అడుగుతోందన్నారు. పౌర సమాజం దీనిని నిరంతరం నిలదీసేందుకు ప్రయత్నం చేస్తుందని స్పష్టం చేశారు.