పౌర సమాజానికి కాంగ్రెస్ భరోసా
ప్రజా ప్రభుత్వం పరిష్కరిస్తుంది
హైదరాబాద్ – పౌర సమాజం లేవనెత్తిన సమస్యలను కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తుందన్నారు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపా దాస్ మున్షీ. శనివారం హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో పౌర సంఘాలు, ప్రజాస్వామిక సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి దీపా దాస్ మున్షీతో పాటు కీలక నేతలు, మేధావులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా పౌర సమాజం నుంచి వచ్చిన సూచనలు, సలహాలను తాము స్వీకరిస్తామని ఆ దిశగా ప్రభుత్వానికి అందజేయడం జరుగుతుందన్నారు. ఇవాళ అందరికీ, అన్ని వర్గాల వారికి మేలు చేకూర్చేలా తాము నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఇప్పటికే ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీలను అమలు చేసే పనిలో ఉన్నామని తెలిపారు. ఇందులో ఇప్పటికే నాలుగు పథకాలు అమలులోకి వచ్చాయన్నారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో భారీ ఎత్తున ఉచితంగా మహిళలు బస్సులలో ప్రయాణం చేస్తున్నారని, ఆదాయం కూడా సమకూరు తోందని చెప్పారు.
ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.