NEWSANDHRA PRADESH

ఏపీలో కాంగ్రెస్ లో పెరిగిన పోటీ

Share it with your family & friends

1351 మంది ద‌ర‌ఖాస్తు

విజ‌య‌వాడ‌- ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఎన్నిక‌ల వేడి రాజుకుంది. త్వ‌ర‌లో అసెంబ్లీ, పార్ల‌మెంట్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇప్ప‌టికే ఏపీ పీసీసీ ఆయా సీట్ల‌కు సంబంధించి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానించింది. భారీ ఎత్తున పోటీ నెల‌కొంది. ఈ విష‌యాన్ని మాజీ చీఫ్ , సీడ‌బ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్ర‌రాజు ధ్రువీక‌రించారు.

ఆదివారం ఆయ‌న ఆంధ్ర ర‌త్న భ‌వ‌న్ లో మీడియాతో మాట్లాడారు. విధేయ‌త‌, నిబ‌ద్ధ‌త‌, అంకిత భావం క‌లిగిన వారినే తాము ఎంపిక చేయ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్కం ఠాకూర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి, ఏపీ ఇన్చార్జ్ మయప్పన్ ల ఆధ్వ‌ర్యంలో కమిటీ సభ్యులు, పార్టీలోని పలు విభాగాల ముఖ్యులు పాల్గొని వివిధ అంశాలపై చర్చించినట్లు వివరించారు.

సమావేశంలో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి విధి విధానాల రూప‌కల్పన జరుగుతుందని గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు. మొత్తం 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి 1351 మంది దరఖాస్తు చేసుకున్నట్లు వెల్ల‌డించారు.

కష్టపడి పని చేసే వారికి మాత్రమే పోటీ చేసే అవకాశం దక్కుతుందని తెలిపారు. ప్లీనరీ సమావేశాల్లో నిర్ణయించిన విధంగా సామాజిక సమతుల్యత పాటిస్తూ 50 శాతం సీట్లను ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, యువతకు కేటాయిస్తామమని గిడుగు రుద్ర‌రాజు వెల్లడించారు.