DEVOTIONAL

ఆక‌ట్టుకున్న చండ మేళం

Share it with your family & friends

క‌ళా బృందాల ప్ర‌ద‌ర్శ‌న భేష్

తిరుప‌తి – తిరుప‌తి లోని ప్ర‌సిద్ద పుణ్య క్షేత్రం శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా ఆదివారం క‌ల్ప‌వృక్ష‌ వాహ‌న‌సేవ‌లో చండ మేళం, కోలాటం, చక్క భజనలు త‌దిత‌ర క‌ళా ప్ర‌ద‌ర్శ‌న‌లు భ‌క్తుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. టీటీడీ హిందూ ధ‌ర్మ ప్ర‌చార ప‌రిష‌త్‌, దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వ‌ర్యంలో ఈ ప్ర‌ద‌ర్శ‌న‌లు ఏర్పాటు చేశారు.

క‌ర్ణాట‌క‌ రాష్ట్రం ఉడిపికి చెందిన శ్రీ వీరాంజ‌నేయ బృందం చండ మేళం (కేర‌ళ డ్ర‌మ్స్‌) వాయించారు. కేర‌ళ డ్ర‌మ్స్‌ బృందంలో మొత్తం 18 మంది క‌ళాకారులు ఉన్నారు. వీరు డ్ర‌మ్స్‌, తాళాలు ల‌య‌బ‌ద్ధంగా వాయిస్తూ అందుకు అనుగుణంగా అడుగులు వేస్తూ నృత్యం చేశారు. ఈ వాయిద్య ప్ర‌ద‌ర్శ‌న భ‌క్తుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది.

అదే విధంగా, తిరుప‌తికి చెందిన రేవ‌తి ఆధ్వ‌ర్యంలో శ్రీ వైభ‌వ వేంక‌టేశ్వ‌ర కోలాట భ‌జ‌న బృందంలోని 20 మంది స్థానిక మ‌హిళా కళాకారులు కోయ‌వాళ్ళ వేష ధార‌ణ‌లో కోలాటాలు, నృత్యం భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

కీల‌పూడికి చెందిన శ్రీ అభ‌య ఆంజ‌నేయ‌ కోలాట భజన బృందములోని 7 నుండి 12 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు గ‌ల విద్యార్థిని విద్యార్థులు కోలాటం, చ‌క్క భ‌జ‌న‌ల ప్రదర్శన చేశారు. టంగుటూరుకు చెందిన శ్రీ సాయి ల‌క్ష్మీ శ్రీ‌నివాస భ‌జ‌న బృందంలోని 20 మంది క‌ళాకారులు, గాజుల మండ్యంకు చెందిన 20 మంది క‌ళాకారుల కోలాటాలు భ‌క్తుల‌ను ఆక‌ర్షించాయి.