సోమస్కంద మూర్తిగా శ్రీ కామాక్షి
ఘనంగా శ్రీ కపిలేశ్వర స్వామి ఉత్సవాలు
తిరుపతి – తిరుపతి లోని శ్రీ కపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజైన ఆదివారం ఉదయం శ్రీ కపిలేశ్వర స్వామి వారు కామాక్షి అమ్మవారి సమేతంగా సోమస్కందమూర్తిగా భూత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
వాహన సేవ ఆలయం నుండి మొదలై కపిల తీర్థం రోడ్, అన్నారావు సర్కిల్, వినాయక నగర్ క్వార్టర్స్, హరేరామ హరేకృష్ణ గుడి, ఎన్జిఓ కాలనీ, అలిపిరి బైపాస్ రోడ్ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. భక్తజన బృందాల చెక్క భజనలు, వాయిద్యాలు ఆకట్టుకున్నాయి.
పూర్వం క్రూర భూతాలు ప్రజలను బాధిస్తున్న వేళ పరమశివుని బ్రహ్మదేవుడు ఆ భూతాలను నిగ్రహించి లోకాలను కాపాడమని వేడుకొన్నాడు. ఈ కార్యానికి నిర్జన దేశమైన శ్మశానాలను తన ఆస్థానాలుగా చేసుకున్నాడు శివుడు.
భూతాలను వశీకరించి శ్మశానాలలో ఉంచి బ్రహ్మ సృష్టిని రక్షిస్తున్నాడని, నాటి నుండి ”భూతపతి”గా కీర్తించే జీవులకు భయాలను తొలగించి శివుడు రక్షిస్తున్నాడని మహాభారతం వివరిస్తోంది. అందుకు ప్రతీకగా లయకారుడు భూత వాహనంపై ఊరేగి భక్తులకు అభయమిచ్చారు.
అనంతరం ఆలయంలో స్నపన తిరుమంజనం ఘనంగా జరిగింది. శ్రీ సోమస్కంద మూర్తి, శ్రీకామాక్షి దేవి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్లరసాలు, చందనంతో అభిషేకం చేశారు.