హైదరాబాద్ గాజులకు జీఐ ట్యాగ్
అరుదైన ఘనత సాధించిన నగరం
హైదరాబాద్ – ప్రపంచ వ్యాప్తంగా మరోసారి హైదరాబాద్ నగరం విస్తు పోయేలా చేసింది. అరుదైన ఘనతను సాధించింది. ప్రఖ్యాతి కలిగిన లాక్ గాజులకు జీఐ ట్యాగ్ లభించింది. హైదరాబాద్‌లోని చార్మినార్ సమీపంలోని లాడ్ బజార్‌లోని ప్రసిద్ధ లాక్ బ్యాంగిల్స్ ఇప్పుడు జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జిఐ) రిజిస్ట్రేషన్ మంజూరు చేయబడ్డాయి.
ఈ జీఐ ట్యాగ్‌ని భారత ప్రభుత్వ జీఐ రిజిస్ట్రీ శనివారం జారీ చేసింది. ఇందుకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. దీని వల్ల అంతర్జాతీయంగా మరింత ప్రాముఖ్యత లభించనుంది. భారీ ఎత్తున అమ్మకాలు కూడా జరగనున్నాయి. గాజులు అంటేనే లాడ్ బజార్, చార్మినార్, హైదరాబాద్ గుర్తుకు రాక తప్పదు.
హైదరాబాద్ లాక్ బ్యాంగిల్స్ స్థానిక, అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రసిద్ధి చెందాయి, ఈ ప్రాంతంలోని హస్త కళాకారుల నైపుణ్యం, సృజనాత్మకత కారణంగా లక్క రాతితో నిండిన గాజులను తయారు చేయడంలో ఉపయోగించారు.
ఈ కళ 500 సంవత్సరాల క్రితం మొఘల్ కాలంలో ఉద్భవించింది. రాజ కుటుంబాల్లోని మహిళలు లక్కతో తయారు చేసిన గాజులు ధరించే వారు. ఒక్క లాడ్ బజార్‌లోనే దాదాపు 15,000 మంది ప్రజలు గాజుల తయారీలో నిమగ్నమయ్యారు.