12న బీఆర్ఎస్ బహిరంగ సభ
కరీంనగర్ వేదికగా కేసీఆర్ పిలుపు
హైదరాబాద్ – బీఆర్ఎస్ బాస్ , మాజీ సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్దం కావాలని పిలుపునిచ్చారు. ఆదివారం తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. ప్రధానంగా కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాలపై సమీక్షించారు.
ఈ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ప్రణాళిక సంఘం చైర్మన్ వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే రసమయి బాల కిషన్ , తదితర నేతలు హాజరయ్యారు. ఈ సందర్బంగా కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ సత్తా ఏమిటో చూపించాలని అన్నారు. ప్రజలు మన వైపు ఉన్నారని, ఈ విషయం గుర్తించి ఎన్నికల్లో విజయం సాధించేలా ప్రయత్నం చేయాలని సూచించారు కేసీఆర్. ఇందులో భాగంగా ఈనెల 12న కరీంనగర్ లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. లోక్ సభ ఎన్నికల్లో ప్రధానంగా పోటీ బీఆర్ఎస్ , బీజేపీ మధ్యనే ఉంటుందన్నారు.