క్రికెట్ మ్యాచ్ వల్లే రైలు ప్రమాదం
కేంద్ర మంత్రి వైష్ణవ్ కామెంట్స్
న్యూఢిల్లీ – కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రికెట్ మ్యాచ్ చూడటం వల్లనే రైలు ప్రమాదం చోటు చేసుకుందని కుండ బద్దలు కొట్టారు. ఆయన ట్విట్టర్ వేదికగా ఈ కామెంట్స్ చేయడం కలకలం రేపింది.
గత ఏడాది 2023లో ఆంధ్రలో చోటు చేసుకున్న రైలు ప్రమాదానికి ప్రధాన కారణం ఏమిటో తెలిసిందని స్పష్టం చేశారు. ఇందుకు కీలకమైన ఆధారం దొరికిందన్నారు. రైలు ప్రమాదానికి కారణం ఏమిటంటే రైలు నడిపిస్తున్న డ్రైవర్ , కో డ్రైవర్ క్రికెట్ మ్యాచ్ చూడటమేనని పేర్కొన్నారు.
ఈ రైలు ప్రమాదం గత ఏడాది అక్టోబర్ 29న చోటు చేసుకుంది. ఈ ఘోరమైన ప్రమాదంలో 14 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దీనిపై విచారణకు ఆదేశించారు రైల్వే శాఖ మంత్రి. ఈ నివేదికలో ఆసక్తికరమైన వాస్తవం వెలుగు చూసిందని స్పష్టం చేశారు మంత్రి.
రైలు ప్రమాదానికి కారణమైన డ్రైవర్ , అసిస్టెంట్ డ్రైవర్ లు ఇద్దరూ తమ ఫోన్ లో క్రికెట్ చూస్తున్నట్లు తేలిందన్నారు. ఆరోజు రాత్రి 7 గంటలకు ఏపీలోని విజయనగరం జిల్లా కంటకపల్లిలో హౌరా – చెన్నై మార్గంలో రాయగడ ప్యాసింజర్ రైలు విశాఖపట్నం పలాస రైలును వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు మరణించగా 50 మందికి పైగా ప్రయాణీకులు గాయపడ్డారు.