రేవంత్ రెడ్డికి సుప్రీం నోటీసులు
నాలుగు వారాల్లో స్పందించాలి
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి ఈ నోటీసు జారీ అయ్యింది.
ఓటుకు నోటు కేసులో కీలకమైన వ్యక్తిగా ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని, ఆయన ప్రస్తుతం ముఖ్యమంత్రి హోదాలో ఉండడం వల్లన ఈ కేసు పక్కదారి పట్టే అవకాశం ఉందని ఆరోపించారు బీఆర్ఎస్ మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి. ఈ మేరకు ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
దీనిపై ఇవాళ విచారణ చేపట్టింది కోర్టు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి సంజాయితీ కోరుతూ నోటీసు జారీ చేయడం విశేషం. నాలుగు వారాల లోపు నోటీసులకు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది సుప్రీంకోర్టు.
ఇదిలా ఉండగా ఆనాడు సీఎం కేసీఆర్ ప్రభుత్వం కక్షగట్టి తనపై తప్పుడు ఆరోపణలు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు ఎనుముల రేవంత్ రెడ్డి. ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే జరిగిందని వాపోయారు.