బీఆర్ఎస్ తో బీఎస్పీ పొత్తు ఖరారు
కాంగ్రెస్, బీజేపీ రెండూ ఒక్కటే
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు శర వేగంగా మారుతున్నాయి. పొత్తులు కుదురుతున్నాయి. మంగళవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) చీఫ్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ బాస్ , మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో భేటీ అయ్యారు.
ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో భారత రాజ్యాంగం సంక్షోభంలో ఉందన్నారు. దీనిని కాపాడు కోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు కుట్ర జరుగుతోందని ధ్వజమెత్తారు.
ఈ దేశంలో రెండు ప్రమాదకరమైన పార్టీలు ఉన్నాయని అవి ఒకటి కాంగ్రెస్ పార్టీ అయితే రెండోది బీజేపీ అని సంచలన ఆరోపణలు చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఈ రెండింటిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్నారు. తమ స్నేహం తెలంగాణను పూర్తిగా మార్చి వేస్తుందన్న నమ్మకం తనకు ఉందన్నారు.
నాలుగు నెలలు కాక ముందే రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ పట్ల ప్రజల నమ్మకం పోయిందన్నారు. ఆచరణకు నోచుకోని హామీలు భారంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ పొత్తు కొత్త చరిత్రకు నాంది పలకనుందని పేర్కొన్నారు ఆర్ఎస్పీ.