నాగర్ కర్నూల్ బరిలో ఆర్ఎస్పీ
మద్దతు ప్రకటించనున్న బీఆర్ఎస్
హైదరాబాద్ – రాష్ట్రంలో రాజకీయాలు శర వేగంగా మారుతున్నాయి. నిన్నటి దాకా కేసీఆర్ ఆయన పరివారాన్ని ఏకి పారేస్తూ వచ్చిన బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నట్టుండి మంగళవారం బీఆర్ఎస్ బాస్ , మాజీ సీఎం కేసీఆర్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
హైదరాబాద్ లోని నంది నగర్ నివాసంలో మర్యాద పూర్వకంగా కేసీఆర్ తో భేటీ అయ్యారు. రాష్ట్ర రాజకీయాలలో పెను ప్రకంపనం రేపింది. నిన్నటి దాకా ఉప్పు నిప్పుగా ఉన్న ఆర్ఎస్పీ ఉన్నట్టుండి యూ టర్న్ తీసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి.
ఇది పక్కన పెడితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వంత జిల్లా ఉమ్మడి పాలమూరు. గద్వాల జిల్లా ఆలంపూర్ నియోజకవర్గం. ఆయన ఎస్పీగా ఉన్నారు. ఆ తర్వాత గురుకులాల సెక్రటరీగా పని చేశారు. అనూహ్యంగా పదవికి రాజీనామా చేశారు. ప్రజల కోసం సేవ చేసేందుకు తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు.
బీఎస్పీలో చేరారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేశారు. ఆయన తాజాగా పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా నాగర్ కర్నూల్ లోక్ సభ నియోజకవర్గం నుంచి బరిలో ఉండనున్నట్లు సమాచారం. ఈ మేరకు బీఆర్ఎస్ నుంచి అభ్యర్థిని పోటీలో నిలపకుండా ఆర్ఎస్పీకి మద్దతు ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.