ఆర్ఎస్పీ నిర్వాకం ఆకునూరి ఆగ్రహం
ఇన్నాళ్లు మీరు చెప్పింది అబద్దాలేనా
హైదరాబాద్ – సోషల్ డెమోక్రటిక్ ఫోరం (ఎస్డీఎఫ్) కన్వీనర్, మాజీ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి నిప్పులు చెరిగారు. బీఎస్పీ బాస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాజీ సీఎం కేసీఆర్ తో భేటీ కావడం, రాబోయే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. మంగళవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు ఆకునూరి మురళి.
ఇది ఊహించనిదని పేర్కొన్నారు. ఎలా స్పందించాలో తనకు అర్థం కావడం లేదని పేర్కొన్నారు. గత రెండు సంవత్సరాలుగా బీఆర్ఎస్ ద్వారా మీరు చెప్పినవన్నీ తప్పులు అయినట్టేనా అని ప్రశ్నించారు. అప్పుడు దుర్మార్గంగా కనబడిన కేసీఆర్ ఇప్పుడు మీ దృష్టిలో హీరో ఎలా అయ్యాడని నిలదీశారు ఆకునూరి మురళి.
గాడిద మీద ఎక్కైనా సరే మీరు ఎంపీ కావాల్సిందేనా అని ఎద్దేవా చేశారు. రేపు బీఆర్ఎస్ కేంద్రంలో ఎవరికి మద్దతు ఇస్తుందో తెలియకుండా మీరు ఎలా కలిశారని అనుకోవాలని పేర్కొన్నారు. ఎవరు రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారో అర్థం చేసుకోలేరా జనం అని మండిపడ్డారు.
రాజకీయాల్లో విలువలు ఉండవనే వాదనను మీరు కూడా అనుసరిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆకునూరి మురళి. ఇది పూర్తిగా అన్యాయమని, ఇది మీకు తగదని అన్నారు .