రేపే కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు
ప్రకటించే ఛాన్స్ ఉందన్న రేవంత్
హైదరాబాద్ – రాష్ట్రంలో త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డాయి. భారతీయ జనతా పార్టీ మొత్తం 17 సీట్లకు గాను 9 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. తాజాగా రాష్ట్రంలో కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ పార్టీ సైతం అభ్యర్థులను ఎంపిక చేసేందుకు మల్లగుల్లాలు పడుతోంది. భారీ ఎత్తున పోటీ నెలకొనడంతో టీపీసీసీ చీఫ్ , సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి ఆశావహులతో కూడిన జాబితాను పార్టీ హైకమాండ్ కు పంపించారు.
ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ ఖరారు చేస్తుందని ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే ఇందులో ఊహించని రీతిలో రేవంత్ రెడ్డి ముందుగానే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కోడంగల్ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఉమ్మడి పాలమూరు జిల్లా లోక్ సభ ఎంపీ అభ్యర్థిని ఖరారు చేశారు. ఇది అందరినీ విస్తు పోయేలా చేసింది.
కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే, సీడబ్ల్యూసీ మెంబర్ చల్లా వంశీ చందర్ రెడ్డిని పార్టీ తరపున క్యాండిడేట్ గా ప్రకటించారు సీఎం. మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈనెల 7న గురువారం తమ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల జాబితాను ప్రకటించే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు.