నిధులు కేటాయిస్తే జంప్ అవుతా
బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం కామెంట్స్
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు శర వేగంగా మారుతున్నాయి. అనుకోని రీతిలో బీఆర్ఎస్ పవర్ నుంచి దూరమై పోయింది. నిన్నటి దాకా కేసీఆర్ వెంటే ఉంటామని, ఆయనే తమకు దేవుడు అంటూ పదే పదే బీరాలు పలికిన నేతలు, ప్రజా ప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం పక్క చూపులు చూస్తున్నారు. ఉద్యమ సారథిగా గుర్తింపు పొందిన తెలంగాణ బాపు అని పిలుచుకునే నేతలంతా జంప్ జిలానీలుగా మారడం విస్తు పోయేలా చేసింది.
ప్రజా సేవ కంటే పదవులే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు. ఇప్పటి దాకా పెద్దపల్లి , నాగర్ కర్నూల్ ఎంపీలు వెంకటేశ్ నేత, పోతుగంటి రాములు జంప్ అయ్యారు. ఇదే గులాబీ పార్టీకి చెందిన జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కాషాయ జెండా కప్పుకున్నారు.
రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ సైతం బీఆర్ఎస్ లో చేరారు. నిన్న చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య సీఎంను కలుసుకున్నారు. ఇది విస్తు పోయేలా చేసింది. ఇదే సమయంలో ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అనుంగు అనుచరుడిగా పేరు పొందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఉన్నట్టుండి మనసు మార్చుకున్నట్లు అనిపిస్తోంది.
ఆయన సీఎం ఎనుముల రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. కేవలం మర్యాద పూర్వకంగా కలిశానని అని బయటకు చెప్పినా చివరకు జంప్ అయ్యేందుకేనని పేర్కొనడం విశేషం. పార్టీ మారడంపై కీలక వ్యాఖ్యలు చేశారు తెల్లం వెంకట్రావు.
తనకు నిధులు అవసరమని, ఆలోచిస్తున్నానని అభివృద్ది చేస్తే దేనికైనా సిద్దమని ప్రకటించారు. నియోజకవర్గ సమస్యలపై సీఎంను కలిశానని, ఈనెల 11న జరిగే ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలో తాను పాల్గొంటానని ప్రకటించారు తెల్లం వెంకట్రావు.