పవర్ లోకి వస్తే పేర్లు మారుస్తాం
ప్రకటించిన భారతీయ జనతా పార్టీ
హైదరాబాద్ – రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంది. ప్రస్తుతం నగరంలో ఎంఐఎం వర్సెస్ బీజేపీ మధ్య పోటీ కొనసాగుతోంది. ఆయా పార్టీలకు చెందిన నేతల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. అయితే విచిత్రం ఏమిటంటే ఇంకా కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు. కానీ ఒకరిపై మరొకరు విమర్శలకు పని పెట్టారు.
ఒక రకంగా చెప్పాలంటే కొత్త నినాదం తల మీదకు ఎత్తుకుంది బీజేపీ. వై నాట్ 400 సీట్స్ అనే నినాదంతో పాటు తెలంగాణలో కొత్త స్లోగన్ అందుకుంది. అదేమిటంటే బ్రిటీష్, నిజాం కాలం నాటి పాలనలో ఆయా జిల్లాలకు, ప్రాంతాలకు పెట్టిన పేర్లు ఇప్పటికీ ఉన్నాయి. వీటిని మార్చాలంటూ కొద్ది కాలం నుంచి బీజేపీ డిమాండ్ చేస్తూ వస్తోంది.
తాజాగా త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పేర్లు మార్చడమే పనిగా పెట్టుకుని ప్రచార అస్త్రంగా మార్చుకోనుంది. మొత్తంగా చూస్తే తెలంగాణలో బీజేపీ నేమ్ గేమ్ ఆడుతోంది. హైదరాబాద్ పేరును భాగ్యనగరం అని, మూసాపేట నుంచి మస్కీ పేట చేస్తామంటూ ప్రకటించింది.
ఇక ఎంపీ ఓవైసీతో పోటీ పడుతున్న కొంపెల్ల మాధవీలత సైతం ఇదే డిమాండ్ చేస్తోంది. హైదరాబాద్ ను భాగ్య నగర్ గా మార్చాలని పట్టుబడుతోంది. పట్టణాలే కాదు ఊర్ల పేర్లు కూడా మార్చాలని అంటున్నారు. అంతే కాదు నిజామాబాద్ ను ఇందూరు, ఆదిలాబాద్ ను ఏదులాపురం, మహబూబ్ నగర్ ను పాలమూరు, వరంగల్ ను ఓరుగల్లు, కరీంనగర్ ను కరిపురంగా మార్చాలని ఆమె కోరుతున్నారు.