ఏపీ రాజధాని మిలియన్ డాలర్ ప్రశ్న
ఎద్దేవా చేసిన బీజేపీ చీఫ్ పురందేశ్వరి
అమరావతి – ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్దానికి తెర లేపింది. ఒకరిపై మరొకరు మాటల తూటాలు పేల్చుతున్నారు. మరింత రాజకీయాన్ని రక్తి కట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఓ వైపు జగన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ముందుకు వెళుతుంటే , నీకు అంత సీన్ లేదంటున్నాయి ప్రతిపక్షాలు.
ప్రస్తుతం ఎవరు ఎక్కడ పోటీ చేస్తారనేది పక్కన పెడితే తెలుగుదేశం, జనసేన పార్టీలు సంయుక్తంగా ఈసారి ఎన్నికల్లో పోటీ చేయనున్నాయి. ఇప్పటికే పొత్తును ఖరారు చేశాయి. ఈ తరుణంలో భారతీయ జనతా పార్టీ మాత్రం వేచి చూసే ధోరణి అవలంభిస్తోంది.
అయితే బుధవారం ట్విట్టర్ వేదికగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో రాజధాని అన్నది లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది జగన్ రెడ్డి పాలిస్తున్న ఏపీనేనని పేర్కొన్నారు. ఏపీకి కేపిటల్ సిటీ అన్నది ఓ మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారి పోయిందని ఎద్దేవా చేశారు.
త్వరలోనే పొత్తుపై కీలక నిర్ణయం హైకమాండ్ తీసుకుంటుందని స్పష్టం చేశారు. అంత వరకు ఓపిక పట్టాలని సూచించారు బీజేపీ చీఫ్. మొత్తంగా తాను మళ్లీ సీఎం అవుతానంటూ జగన్ రెడ్డి చేసిన కామెంట్స్ పై భగ్గుమన్నారు దగ్గుబాటి పురందేశ్వరి.