NEWSTELANGANA

రైతు నేస్తం స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం

Share it with your family & friends

ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ – రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ సర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌ధానంగా వ్య‌వ‌సాయ రంగానికి చెందిన రైతుల‌కు మేలు చేకూర్చేలా రైతు నేస్తం కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టింది. స‌చివాల‌యంలో బుధ‌వారం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క దీనిని ప్రారంభించారు.

ఈ కార్య‌క్ర‌మంలో వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు పాల్గొన్నారు. రైతు వేదిక‌లకు వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా అన్న‌దాత‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు వీలు క‌లుగుతుంద‌ని పేర్కొన్నారు సీఎం.

దశలవారీగా 3 సంవత్సరాల్లో 2601 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లను స్థాపించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. రూ.97 కోట్ల తో ప్రాజెక్టు అమ‌లు చేస్తున్నామ‌ని తెలిపారు సీఎం. మొదటి దశలో 110 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలిపారు.

ఇందుకు గాను రూ. 4.07 కోట్లు మంజూరు చేయ‌డం జ‌రిగింద‌న్నారు రేవంత్ రెడ్డి. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతులకు చేదోడు వాదోడుగా డిజిటల్‌ ఫ్లాట్‌ ఫారంను ఏర్పాటు చేశామ‌న్నారు.
వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులతో క్షేత్ర స్థాయిలో సమస్యలపై రైతులతో చర్చలు జ‌రుపుతార‌ని తెలిపారు.

గ్రామాల నుంచే రైతులు ఆన్ లైన్ లో పంటలకు సంబంధించిన సలహాలు, సూచనలు అందుకోవటం, తమ అనుభవాలను ఇతర రైతులతో పంచుకోవటం జ‌రుగుతుంద‌న్నారు. ప్రతి మంగళవారం, శుక్రవారం విస్తరణాధికారులు, రైతులతో రైతు నేస్తం కార్యక్రమం అమలవుతుంద‌ని తెలిపారు సీఎం.