చంద్రబాబు బీసీ వ్యతిరేకి
మంత్రి ధర్మాన ప్రసాదరావు
శ్రీకాకుళం జిల్లా – రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు నిప్పులు చెరిగారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు. కరుడుగట్టిన బీసీ వ్యతిరేకి అని ఎద్దేవా చేశారు. బీసీలకు రాజ్యాధికారం ఇవ్వకుండా జయహో బీసీ ఎలా అవుతుందని ప్రశ్నించారు. బుధవారం ధర్మాన ప్రసాదరావు మీడియాతో మాట్లాడారు.
జగన్ వల్లనే సాధికారత , సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. చంద్రబాబు మోసానికి చిరునామా అని అన్నారు. బీసీలకు సంబంధించి ఏం చేశామనే దానిపై తాము చర్చకు సిద్దంగా ఉన్నామని సవాల్ విసిరారు. ముందు వారి జీవితాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఇవాళ నవ రత్నాలు పేరుతో తీసుకు వచ్చిన పథకాలు కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు ప్రసాదించాయని చెప్పారు ధర్మాన ప్రసాదరావు.
చంద్రబాబు చెప్పేది సామాజిక న్యాయం కాదని, ఎన్నికల కోసం మభ్యపెట్టే కార్యక్రమమని ఆరోపించారు. 14 ఏళ్ల పాటు సీఎంగా ఉన్న చంద్రబాబు బీసీలకు పవర్ ఇచ్చిన పాపాన పోలేదన్నారు ధర్మాన ప్రసాదరావు. రాజ్యసభకు ఒక్క బీసీని చంద్రబాబు పంపించిన దాఖలాలు లేవన్నారు.
నయా పైసా లంచం లేకుండా రూ.1.22 లక్షల కోట్లు డిబిటి ద్వారా బీసీల అకౌంట్లలో జమ చేశామన్నారు. ఇదంతా ఎన్నికల స్టంట్ తప్ప ఏపీకి ప్రత్యేకించి బీసీలకు చేసింది ఏమీ లేదని మండిపడ్డారు ధర్మాన ప్రసాదరావు.