ఎన్టీఆర్ చేతుల్లోనే టీడీపీ సేఫ్
మాజీ మంత్రి కొడాలి నాని కామెంట్
అమరావతి – మాజీ మంత్రి కొడాలి నాని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈసారి ఎన్నికల్లో టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడును అడ్రస్ లేకుండా చేయాలని పిలుపునిచ్చారు. బుధవారం ఆయన విజయవాడలో మాట్లాడారు. బాబు ఓడి పోతే తెలుగుదేశం పార్టీ జూనియర్ ఎన్టీఆర్ చేతుల్లోకి వస్తుందన్నారు.
కుట్రలు, కుతంత్రాలు, మోసాలకు పెట్టింది పేరు చంద్రబాబు అని మండిపడ్డారు. జైలుకు వెళ్లి వచ్చినా ఇంకా సిగ్గు రాలేదన్నారు కొడాలి నాని. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసినా వైసీపీని ఏమీ చేయలేవన్నారు. వై నాట్ 175 అన్న నినాదంతో తాము ముందుకు వెళుతున్నామని చెప్పారు.
ప్రజలు సుస్థిరమైన పాలన, సమర్థవంతమైన నాయకత్వాన్ని కోరుకుంటున్నారని ఆ రెండూ తమ పార్టీ ఇస్తోందన్నారు. ఇవాళ దేశంలో ఎక్కడా లేని రీతిలో సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత ఒక్క ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు కొడాలి నాని.
చంద్రబాబు , పవన్ పగటి కలలు కంటున్నారని, గతంలో కంటే ఈసారి మరింత దారుణంగా ఓడి పోబోతున్నారని జోష్యం చెప్పారు మాజీ మంత్రి. ఇకనైనా సొల్లు కబుర్లు చెప్పడం ఆపేసి నిర్మాణాత్మకమైన సూచనలు ఇస్తే బావుంటుందన్నారు.