పీకే మాటలన్నీ అబద్దాలే
విజయ సాయి రెడ్డి కామెంట్స్
అమరావతి – వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి ఫైర్ అయ్యారు. రాజకీయ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను ఏకి పారేశారు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడం లేదన్నారు. పని లేకుండా పోయిందని అందుకే నోటికి వచ్చినట్లు కామెంట్స్ చేస్తున్నాడంటూ ఎద్దేవా చేశారు. బుధవారం విజయ సాయి రెడ్డి మీడియాతో మాట్లాడారు.
తాను నెల్లూరు నుంచి లోక్ సభ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నానని ప్రకటించారు ఎంపీ. సిద్దం సభ వేదికగా జగన్ మోహన్ రెడ్డి తమ పార్టీకి సంబంధించి మేనిఫెస్టో ప్రకటిస్తారని తెలిపారు. పీకే మాటల్లో విశ్వసనీయత లేదని, అందులో దురుద్దేశం కూడుకుని ఉన్నదని పేర్కొన్నారు.
ఇక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తనకు మంచి స్నేహితుడని చెప్పారు విజయ సాయి రెడ్డి. రాజకీయం వేరు స్నేహం వేరన్నారు. అయితే మంత్రి జయరామ్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ. టీడీపీ కండువా కప్పుకోవాలని అనుకుంటే ముందు రాజీనామా చేయాల్సి ఉండేదన్నారు. అలా చేయకుండా పార్టీలోకి జంప్ కావడం ఏం పద్దతి అని ప్రశ్నించారు.
చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పగటి కలలు కంటున్నారని వారికి అంత సీన్ లేదన్నారు ఎంపీ. తాము కచ్చితంగా గెలుస్తామని, తిరిగి సీఎం గా జగన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని జోష్యం చెప్పారు.