ప్రజల కోసం పోరాడుతూనే ఉంటా
రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు
హైదరాబాద్ – బీఆర్ఎస్ తో ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సి వస్తుందనే దానిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. గురువారం ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
దేశంలో రాజ్యాంగానికి , లౌకికత్వానికి పొంచి ఉన్న పెను ముప్పును దృష్టిలో ఉంచుకొని, బహుజన సాధికారత-రక్షణ-భవిష్యత్తే లక్ష్యంగా, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడం కోసం రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్పీ కలిసి పని చేయాలని నిర్ణయం తీసుకున్నాయని తెలిపారు.
రాజకీయ పార్టీలు తమ తమ సిద్దాంతాలు, బలాలు, బలహీనతలను దృష్టిలో ఉంచుకొని, రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా, విజయం కోసం తమ వ్యూహాలను మార్చుకోవడం సర్వ సాధారణమని స్పష్టం చేశారు. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు, ప్రతి పక్షంలో ఉన్న పార్టీలు తమ ప్రస్థానంలో ఎక్కడో ఒక చోట పొత్తులతో ఎదిగినవేనని గుర్తు చేశారు. దురదృష్టవశాత్తు కొందరికి ఇవి కనిపించడం లేదని. అప్పుడెప్పుడూ మాట్లాడని వీళ్లు కేవలం తమ కూటమిపై నోరు పారేసు కోవడాన్ని తప్పు పట్టారు.
ఎన్నికల్లో పట్టుమని పది ఓట్లు రాని వాళ్లు, అంబేద్కర్, ఫూలే, కాన్షీరాం ల ఫోటోలు పెట్టుకుని ప్రజల దగ్గరికి వెళ్లే ధైర్యం లేని, వాళ్ల కోసం పోరాటం చేయలేని పిరికి పందలకు ఈ నిర్ణయాన్ని విమర్శించే అర్హత లేదన్నారు.
చివరిగా ఈ నిర్ణయం సరైందో కాదో చరిత్రనే సమాధానం చెబుతుందన్నారు.