NEWSTELANGANA

ఘ‌ర్ష‌ణ వైఖ‌రి మంచిది కాదు – సీఎం

Share it with your family & friends

కేంద్రంలో ఎవ‌రున్నా సాయం అడుగుతాం

హైద‌రాబాద్ – సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కేంద్రంలో ఎవరున్నా తెలంగాణ అభివృద్ధి కోసం సహకరించాలని అడుగుతూనే ఉంటామని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వైఖరి అభివృద్ధిని కుంటు పరుస్తుందని అన్నారు. ఉత్తర తెలంగాణ అభివృద్ధికి కీలకమైన రాజీవ్‌ రహదారి ఎలివేటెడ్‌ కారిడార్‌కు ముఖ్యమంత్రి గురువారం భూమి పూజ చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ప్ర‌సంగించారు. రాజీవ్ రహదారి ఎలివేటేడ్ కారిడార్ పూర్తయితే మేడ్చల్, కుత్బుల్లాపూర్ అభివృద్ధి చెందడమే కాకుండా, కరీంనగర్, ఆదిలాబాద్ ప్రయాణం సులభతరం అవుతుందన్నారు.

గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో ఈ ప్రాజెక్టు ఆలస్యమైందని, ప్రజల అవసరాలను విస్మరించిందని విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే కేంద్రంతో మాట్లాడి సమస్యను పరిష్కరించామని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, రక్షణ శాఖ మంత్రి రాజ్జ్‌థ్‌ను కలిసి ప్రాజెక్టు అవసరాన్ని వివరించామని తెలియజేశారు. ఈ కారిడార్‌ కోసం స్థానిక లోక్‌సభ సభ్యుడిగా అనేకసార్లు కేంద్రాన్ని కోరాననీ, కంటోన్మెంట్‌ బోర్డు సమావేశాల్లో కూడా లేవనెత్తానని గుర్తు చేశారు.

ఇదిలా ఉండ‌గా ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామీర్‌పేట వరకు 6 లేన్లతో 11.3 కిలోమీటర్ల పొడవున నిర్మించబోయే ఈ కారిడార్‌పై ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను తిలకించారు. ప్రాజెక్టుకు సంబంధించిన పలు వివరాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు.