కార్మికులు ఆర్టీసీకి రథ చక్రాలు
మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్
హైదరాబాద్ – రాష్ట్ర రవాణా రోడ్డు శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్ లు , ఉద్యోగులు కీలకమైన పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. వారంతా ఆర్టీసికి అసలైన రథ చక్రాలు అంటూ ప్రశంసలు కురిపించారు.
తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆర్టీసీని ఆదుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో కేవలం సర్కార్ ఆదేశించిన కేవలం 48 గంటల లోపే మహాలక్ష్మి పథకాన్ని అమలు చేశారని , ఈ సందర్బంగా మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తో పాటు ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నానని అన్నారు.
గురువారం పొన్నం ప్రభాకర్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. ఉచితంగా ప్రయాణం పథకం సక్సెస్ అయ్యిందన్నారు. ఏకంగా ఆర్టీసీలో లక్షలాది మంది ప్రతి రోజూ ప్రయాణం చేస్తున్నారని చెప్పారు. దీని వల్ల దేవాదాయ ధర్మాదాయ శాఖకు అత్యధికంగా ఆదాయం సమకూరిందని పేర్కొన్నారు.
మహాలక్ష్మి పథకంలో మహిళా జీరో టికెట్స్ ద్వారా నష్టం రాదన్నారు. ప్రభుత్వమే డబ్బులు ఆర్టీసీకి చెల్లిస్తుందని స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఉత్తమ అవార్డులు కూడా ఇస్తామని ప్రకటించారు. ఇప్పటి వరకు ఆర్టీసీ బస్సులలో 24 కోట్ల మహిళలు జర్నీ చేశారని చెప్పారు.