సమ్మక్క సారలమ్మ జాతరలో గొడవపై
హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. మంగళవారం సీఐడీ నోటీసులు జారీ చేసింది. గత జనవరి నెల 29వ తేదీన సమ్మక్క సారక్క జాతర వద్ద జరిగిన గొడవలో కరీంనగర్ కమిషనర్ పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడని కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసును సీఐడీకి అప్పగించడంతో, ఏప్రిల్ 4వ తేదీన హైదరాబాద్ నగరంలో ఉన్న సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. ఈ సందర్బంగా తనకు నోటీసులు ఇవ్వడం పట్ల స్పందించారు కౌశిక్ రెడ్డి. తాను ఏ తప్పు చేయక పోయినా సర్కార్ కావాలని తనను కక్ష సాధింపులకు గురి చేస్తోందని ఆరోపించారు.
ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో నాకు, నా కుటుంబానికి, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు CID నోటీసులు ఇవ్వడం ఎంతో బాధ కలిగించిందన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాననే కారణంతో ఇలా బెదిరింపులకు గురిచేయడం తగునా అని ప్రశ్నించారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. దమ్ముంటే తనను వ్యక్తిగతంగా ఎదుర్కోవాలని, కానీ ఇలా అక్రమ కేసులు బనాయించడం మంచి పద్దతి కాదన్నారు. చట్ట పరంగా తాను తేల్చుకుంటానని స్పష్టం చేశారు. తనకు చట్టం పట్ల గౌరవం ఉందన్నారు ఎమ్మెల్యే. నన్ను ఇబ్బందులకు గురి చేసినా, ఎన్ని నోటీసులు ఇచ్చినా తాను వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.






