DEVOTIONAL

టీటీడీ ఆధ్వ‌ర్యంలో ప‌ద్మావ‌తి అవార్డులు

Share it with your family & friends

బహూక‌రించిన టీటీడీ చైర్మ‌న్, ఈవో

తిరుప‌తి – తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి ఆధ్వ‌ర్యంలో అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వాన్ని ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి, ఈవో ధ‌ర్మా రెడ్డి, ప్ర‌ముఖ ప్ర‌చార క‌ర్త‌లు పాల్గొన్నారు.

ఇదిలా ఉండ‌గా టీటీడీలోని వివిధ విభాగాల‌లో విశిష్ట సేవ‌లు అందించిన 20 మంది మ‌హిళా ఉద్యోగుల‌కు
ప‌ద్మావ‌తి పుర‌స్కారాల‌ను అంద‌జేశారు. వీరిని శాలువతో సన్మానించి 5 గ్రాముల వెండి డాలర్, శ్రీ పద్మావతి అమ్మ వారి జ్ఞాపిక అందించారు.

వీరిలో టీటీడీ సంక్షేమ విభాగం డెప్యూటీ ఈవో స్నేహలత, ఎస్వీ సంగీత కళాశాల ప్రిన్సిపాల్ డా. ఉమా ముద్దుబాల, శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు డా. సుజాతమ్మ, సూపరింటెండెంట్లు మల్లీశ్వరి, ఇందిర, చీఫ్ పీఆర్వో కార్యాలయ అసిస్టెంట్ సుగుణ తదితరులు ఉన్నారు.

అదేవిధంగా, ఏడాది కాలంలో ఉద్యోగ విరమణ చేయనున్న 57 మంది మహిళా ఉద్యోగులను శాలువ, జ్ఞాపికతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముందుగా ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకురాలు శ్రీవాణి బృందం ప్రదర్శించిన వీణా వాద్య కచేరి ఎంతగానో ఆకట్టుకుంది.

అనంతరం మహిళా ఉద్యోగులకు నిర్వహించిన వ్యాసరచన, పెయింటింగ్, క్విజ్, గాత్ర సంగీత పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. టీటీడీ మహిళా ఉద్యోగులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను చక్కగా నిర్వహించారు.