ముగ్గురు కలిసినా గెలుపు మాదే
స్పష్టం చేసిన విజయ సాయి రెడ్డి
అమరావతి – వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో త్వరలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన పార్టీ కూటమి ముందుకు వెళుతుందని ప్రకటించడం వల్ల ఒరిగేది ఏమీ లేదన్నారు. ఇదే సమయంలో ఇవాళ బాబు, పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీ, కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ షాతో కలిశారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఒక్కటై కూటమిగా ముందుకు సాగాలని ప్రయత్నం చేయడంపై స్పందించారు విజయ సాయి రెడ్డి.
ఆయా పార్టీల పొత్తులపై ఎంపీ కీలక కామెంట్స్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 2014 నాటి కూటమికి దీనికి తేడా ఏమీ లేదన్నారు. ఆనాడు చేసిన మోసాలు, అబద్దాలు, అమలు కాని హామీలు ఆయా పార్టీలకు వర్తిస్తాయని ఎద్దేవా చేశారు విజయ సాయిరెడ్డి.
ఆరు నూరైనా వైసీపీ విజయాన్ని అడ్డుకునే శక్తి లేదన్నారు. తిరిగి మరోసారి సీఎం జగన్ మోహన్ రెడ్డిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయని జోష్యం చెప్పారు. సుస్థిరమైన పాలనకు, సమర్థవంతమైన నాయకత్వానికి ప్రజలు ఓట్లు వేస్తారని స్పష్టం చేశారు ఎంపీ.