కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం చంద్రబాబు
అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మరోసారి హైదరాబాద్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తను చేసిన కృషి వల్లనే అభివృద్ది చెందిందని అన్నారు. నాలెడ్జి ఎకానమీగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు వేసిన పునాదుల వల్ల మోస్ట్ లివబుల్ సిటిగా అది మారిందన్నారు. సింగపూర్ మాస్టర్ ప్లాన్ తో నిర్మాణం ప్రారంభించేందుకు ప్రధాని మోదీ కూడా శంకుస్థాపన చేశారని అన్నారు. దేశంలో ఉండే పవిత్ర మైన దేవాలయాలు, ప్రార్ధనాలయాల నుంచి మట్టిని, నదుల నుంచి నీటిని తెప్పించాం అన్నారు. ప్రధాని కూడా పార్లమెంటు నుంచి మట్టిని, యమునా జలాలను తీసుకు వచ్చారని తెలిపారు.
పార్లమెంటు, యావత్ దేశం అంతా అండగా ఉంటుందనే ఆ మట్టిని, నీటిని తెచ్చినట్టు ప్రధాని చెప్పారన్నారు. నిన్న పార్లమెంటులో జరిగిన చట్టబద్దత బిల్లుపై కూడా దేశం మొత్తం అమరావతికి అండగా నిలిచిందని చెప్పారు. వైసీపీ వాళ్లు అడుగడుగునా కుట్రలు, కుతంత్రాలు చేస్తూనే ఉన్నారని ఆరోపించారు నారా చంద్రబాబు నాయుడు. అమరావతి అడుగు పడిన సమయంలోనే రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారని అన్నారు. అమరావతిపై వ్యతిరేకతతో ప్రపంచ బ్యాంకుకు కూడా లేఖలు రాశారని మండిపడ్డారు. అరాచకం సృష్టించే ప్రయత్నించారని పేర్కొన్నారు. నిర్మాణాలకు అనుకూలంగా తప్పుడు రిపోర్టులు తెప్పించారన్నారు. ఎడారి, శ్మశానం అన్నారు. భూకంపాలు వస్తాయన్నారు. ఎన్ని విధాల రాజధానిని నష్టపరచాలో అంతా చేశారు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.





